దేశీయ ఐటీ కంపెనీలకు మరో షాక్‌ | Sakshi
Sakshi News home page

దేశీయ ఐటీ కంపెనీలకు మరో షాక్‌

Published Thu, Nov 23 2017 2:55 PM

IT, ITeS companies jittery over Rs 10,000 crore tax demand  - Sakshi

ముంబై : అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలతో తీవ్ర సతమతమవుతున్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ నుంచి మరో షాక్‌ ఎదురైంది. సర్వీసు ట్యాక్స్‌ డిమాండ్‌ కింద రూ.10వేల కోట్లను చెల్లించాలంటూ దేశీయ ఐటీ కంపెనీలను ఆదాయపు పన్ను శాఖ ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆటోమేషన్‌ ముప్పు, కఠినతరమవుతున్న అమెరికా ఇమ్రిగేషన్‌ చట్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలకు ఇది మరింత ప్రతికూలంగా మారింది.  సర్వీసు ట్యాక్స్‌ కట్టాలంటూ ఇప్పటి వరకు 200 పైగా ఐటీ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. 

గత ఐదేళ్లకు సంబంధించి ఎగుమతులపై వచ్చిన ప్రయోజనాలకు సర్వీసు పన్ను కట్టాలని పేర్కొంది. అదనంగా 15 శాతం పన్నుతో పాటు జరిమానాలు కూడా కట్టాలంటూ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐటీ సంస్థలు ఎగుమతి ప్రయోజనాలకు అర్హులు కావని, కచ్చితంగా సేవా పన్ను కట్టాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పన్ను డిమాండ్‌ ఐటీ కంపెనీలకు అతిపెద్ద షాకేనని ఇండస్ట్రీ ట్రాకర్లు కూడా పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసుపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే, పన్ను డిమాండ్‌లో 10 శాతం అక్కడ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. తమకు ఇది అతిపెద్ద సమస్య అని, రూ.175 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు ఓ బహుళ జాతీయ కంపెనీ చెప్పింది.  

Advertisement
Advertisement